Xiaomi India | ఫెస్టివ్ సీజన్.. క్రికెట్ వరల్డ్ కప్.. చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi)కి మంచి ఊపు నిచ్చాయి. 2022లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న షియోమీ.. 2023లో జోరు మీదున్నది. 5జీ స్మార్ట్ ఫోన్ల విక్రయంతో శక్తిని పుంజుకున్నది. భవిష్యత్‌పై ఆశావాదంతో ముందుకు సాగుతున్నది. ఈ ఏడాది ప్రారంభంలో చౌక ధరకే 5జీ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో ఆవిష్కరించింది షియోమీ (Xiaomi). ఫలితంగా మెట్రో పాలిటన్ నగరాలు మొదలు చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు తన మార్కెట్‌ను విస్తరించుకున్నది. ఈ ఏడాదితో ఫెస్టివ్ సీజన్‌లో దీపావళి వరకూ 5జీ స్మార్ట్ ఫోన్ల విక్రయంలో 200 శాతం వృద్ధి నమోదు చేసింది. చౌక 5జీ స్మార్ట్‌ఫోన్లకు పట్టణ ప్రాంతాల్లో మంచి గిరాకీ ఏర్పడింది. తద్వారా మార్కెట్‌లో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంటున్నది.
2022 దీపావళితో పోలిస్తే ఈ ఏడాది 5జీ స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 200 శాతం పెరిగాయి. ఎయిర్‌టెల్, రిలియన్స్ జియో సంస్థలు దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రారంభించడంతో తమ ఫోన్ల విక్రయాలు పుంజుకున్నాయని షియోమీ ఇండియా ప్రెసిడెంట్ బీ.మురళీధరన్ చెబుతున్నారు. దీనికి తోడు క్రికెట్ వరల్డ్ కప్ లైవ్ స్ట్రీమింగ్‌తో నాచురల్‌గా 5జీ స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిందన్నారు. కేవలం మెట్రో పాలిటన్ నగరాలకు మాత్రమే ఈ గిరాకీ పరిమితం కాలేదని తేల్చి చెప్పారు.
`ఢిల్లీ, ముంబైతోపాటు ఐదు అగ్రశ్రేణి నగరాలు ఊహించదగినవే. అహ్మదాబాద్, కోజికోడ్, సూరత్ నగరాల్లో సేల్స్ పుంజుకున్నాయి` అని మురళీధరన్ చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో స్మార్ట్ ఫోన్ల విక్రయంలో నాలుగో స్థానంలో నిలిచిన షియోమీ.. వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్ల పుంజుకున్నదని అన్నారు. ప్రీమియరైజేషన్ చేయడంతోపాటు ఆఫ్‌లైన్ విక్రయాలు కల్పించడం తదితర అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో లక్ష్యాన్ని చేరుకోగలిగామన్నారు.
సెప్టెంబర్ త్రైమాసికం నాటికి టాప్ స్థానానికి చేరుకున్న షియోమీ.. మార్కెట్లో 17.4 శాతం వాటా కలిగి ఉంది. షియోమీ సబ్ బ్రాండ్ పోకో సేల్స్ 50 శాతం పెరిగాయని ఐడీసీ ఇండియా పేర్కొంది. గత 18 నెలలుగా సవాళ్లను ఎదుర్కొన్న షియోమీకి మూడో త్రైమాసికంలోనూ అంచనాలకంటే ఎక్కువ సానుకూల సంకేతాలు ఉన్నాయన్నారు. గతేడాది రెండో అర్థభాగంలో షియోమీ మార్కెట్ వాటా తగ్గుముఖం పట్టిందని మురళీధరన్ తెలిపారు.
ఆర్థిక పరిస్థితులు ఇలాగే కొనసాగితే మున్ముందు కూడా సేల్స్ పుంజుకుంటాయన్నారు మురళీధరన్. వర్షాలు బాగా కురవడంతో గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ పెరిగిందన్నారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం.. ఓనం వేడుకల నుంచి సానుకూల వాతావరణం నెలకొన్నదని చెబుతున్నారు. 50 కోట్ల మందికి పైగా 5జీ స్మార్ట్ ఫోన్ల వినియోగానికి మళ్లే అవకాశం ఉందన్నారు. దేశవ్యాప్తంగా 5జీ ఫోన్ల సేల్స్ మరింత పెంచడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశీయ మార్కెట్లలో ప్రీమియం లేదా టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లకు ప్రాధాన్యం లేదన్నారు.
టీవీ బిజినెస్‌లోనూ దూకుడు
టీవీ బిజినెస్ వృద్ధిలోనూ షియోమీ దూసుకెళ్తున్నది. క్రికెట్ వరల్డ్ కప్‌తోపాటు, ఫెస్టివ్ సీజన్ కలిసి వచ్చాయన్నారు మురళీధరన్. 2022తో పోలిస్తే సుమారు 30 శాతం టీవీ సేల్స్ పెరిగాయన్నారు. గతంతో పోలిస్తే 32-అంగుళాల ప్యానెల్ టీవీల కంటే 4కే రిజొల్యూషన్‌తో 43-అంగుళాల ప్యానెల్ టీవీలకు కస్టమర్లు అప్‌గ్రేడ్ అవుతున్నారు. 2022తో పోలిస్తే ఈ ఏడాది 4కే రిజొల్యూషన్‌తో కూడిన 43 అంగుళాల ప్యానెల్ టీవీలు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. 75 శాతం 43-అంగుళాల ప్యానెల్ టీవీలు అమ్ముడుపోయాయి.
Source link